రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి..
1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ప్రాజెక్టులన్నీ గ్రౌండింగ్ అయ్యేవిధంగా అధికారులు పనిచేయాలి
పారిశ్రామికపార్కుల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఏపీఐఐసీ కార్యాలయంలో జెడ్.యం, జీ.యంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జెడ్.యంలు, జీ.యంలతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఎస్.ఐ.పి.బి సమావేశాల్లో ఆమోదించిన పెట్టుబడులకు చెందిన ప్రాజెక్టులపై చర్చించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలు పెట్టేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. ప్రతి కంపెనీ ప్రతినిధులతో నిరంతరం మాట్లాడి గ్రౌండ్ అయ్యేవిధంగా పనిచేయాలన్నారు. ఇందుకు తమ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి జిల్లాలో తప్పనిసరిగా డి.ఐ.పి.సి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటికే ల్యాండ్ కేటాయించి ఇంకా మొదలుపెట్టని ప్రాజెక్టులపై ఒకటికి రెండు సార్లు మాట్లాడాలన్నారు. అప్పటికీ ప్రాజెక్టు విషయంలో కదలిక లేకపోతే ల్యాండ్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో ఇతర కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. ఏపీఐఐసీ భూములకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. కోర్టు కేసులపై కూడా మంత్రి ఆరా తీశారు. న్యాయ వివాదాలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

