వైసీపీ ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి..
1 min read

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ 2019-20
సంవత్సరంలో 16,924 పరిశ్రమలుంటే, 2023-24కు వచ్చే సరికి 16,011 పరిశ్రమలు ఉన్నాయి
వైసీపీ పాలనలో పారిశ్రామికరంగం ఎలా ఉందో ఆర్.బీ.ఐ నివేదిక ద్వారా బయటపడింది
కర్నూలు, న్యూస్ నేడు: వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడమేమోకానీ ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్లిపోయాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో పారిశ్రామిక ప్రగతి ఎలా ఉందో ఆర్.బీ.ఐ నివేదిక ద్వారా అర్థమవుతుందన్నారు. 2019-20 సంవత్సరంలో రాష్ట్రంలో 16,924 పరిశ్రమలు ఉంటే, 2023-24కు వచ్చే సరికి 16,011 పరిశ్రమలు ఉన్నాయన్నారు. వైసీపీ పరిపాలనలో 913 కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయని తెలిపారు. ఇదే సమయంలో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఏడాదికేడాది పరిశ్రమలు పెరుగుతూ వచ్చాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారని, ఈ నివేదిక చూస్తే వారి పాలనలో ఏం జరిగిందో తెలిసిపోతుందన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన రిపోర్టులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయని పేర్కొందన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ నేతల మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీజీ భరత్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకొని వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోతున్నారన్నారు.

