రాష్ట్ర బడ్జెట్ లో రైతాంగానికి అధిక నిధులు కేటాయించాలి
1 min read

కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ పథకం అమలు చేయాలి
రైతు సంఘం ఏలూరు ఏరియా నాయకులు ఉప్పులూరి హేమ శంకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి,వినతిపత్రం అందించారు.రైతులకు అన్నదాత సుఖీ భవ గత ఏడాది బకాయిలు చెల్లించాలని,రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటి అమలుకు నిధులు మంజూరు చేయకుండా రైతులను మోసగిస్తుందని విమర్శించారు. రైతులకు గత ఏడాది అన్నదాత సుఖీ భవ డబ్బులను ఇంత వరకు చెల్లించకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీ ఇచ్చి నేటికి అమలు చేయలేదని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఉచిత పంటల బీమా పథకం తిరిగి పునరుద్ధరించాలని, ఇన్ పుట్ సబ్సిడీ, కౌలు రైతులకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం స్యూరిటీ లేకుండా 2 లక్షల పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం మండల తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,జిల్లా సమితి సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు, బుగ్గల ప్రభాకర్, బళ్ల కనక దుర్గారావు,ఎం.ఏ. హకీమ్, ఉప్పులూరి లక్ష్మి,దాసిపల్లి ఎర్రయ్య,గాలి కుమార్ బాబు, దేవినేని రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

