మల్బరీ సాగు..భేష్
1 min read

జిల్లాలో 1750 ఎకరాల్లో సాగు విస్తీర్ణం
- ఆసక్తి చూపే రైతులకు ప్రత్యేక రాయితీలు
- యూనిట్ ధరలో ఎస్సీ ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ
- జిల్లా అధికారి డి. ఆంజనేయులు
కర్నూలు కలెక్టరేట్ , న్యూస్ నేడు: మల్బరీ సాగు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందని , అవసరమైన రైతులు ముందుకొస్తే సాగులో మెళకువలు నేర్పి ప్రోత్సహిస్తామన్నారు సెరికల్చర్ జిల్లా అధికారి డి. ఆంజనేయులు. శనివారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 1750 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతోందని, మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో వెల్దుర్తి 600 ఎకరాలు, పత్తికొండలో 200, తుగ్గలిలో 400, ఆదోని డివిజన్ పరిధిలో 400, కర్నూలు పరిధిలో 150 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతోందని తెలిపారు. మల్బరీ సాగు చేసే రైతులకు ఎకరాకు యూనిట్ ధర రూ.30వేలు కాగా ఎస్సీ ఎస్టీలకు రూ.27వేలు సబ్సిడీ, ఇతర రైతులకు రూ. 22,500 సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. అదేవిధంగా షెడ్ల ఏర్పాటుకు యూనిట్ ధర రూ.4 లక్షల 50వేలు కాగా ఎస్సీ ఎస్టీ రైతులకు రూ.4 లక్షల 5000 కాగా, ఇతర రైతులకు రూ.3లక్షల 37,500 సబ్సిడీ ఉంటుందన్నారు. 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడెల్పు, 18 అడుగుల ఎత్తులో షెడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. అలాగే మల్బరీ సాగుకు అవసరమైన పరికరాలను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీతో ఇస్తోందన్నారు. మెటిరియల్ కు యూనిట్ ధర రూ.75వేలు ఉంటే ఎస్సీ ఎస్టీ రైతులకు 67,500, ఇతర రైతులకు 57,500 సబ్సిడీ ఉంటుందని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెరికల్చర్ జిల్లా అధికారి డి. ఆంజనేయులు ఈ సందర్భంగా రైతులను కోరారు.


