NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత పరిష్కారం

1 min read

ఏఐఎన్‌యూలో అరుదైన శస్త్రచికిత్సతో మహిళకు సాధారణ మూత్ర విసర్జన

హైదరాబాద్, న్యూస్​ నేడు: 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా ఆమెకు కొత్త జీవితం అందించారు.జార్ఖండ్‌కు చెందిన గృహిణి (పేరు మార్చారు – పల్లవి) గత దశాబ్దానికి పైగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర ప్రవాహం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాత్‌రూమ్‌లో ఒక్కసారి మూత్ర విసర్జనకు 15–20 నిమిషాల వరకు సమయం పట్టేది. అనేక చోట్ల చికిత్సలు తీసుకున్నా, తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య పూర్తిగా తగ్గలేదు.ఈ పేషెంట్ కి ఏఐఎన్‌యూ బంజారాహిల్స్‌లోని కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ భవతేజ్ ఎంగంటి కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల్లో ఆమె మూత్ర ప్రవాహం పూర్తిగా సాధారణ స్థాయికి చేరింది.గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూలో ఈ విధమైన శస్త్రచికిత్సను 60 మంది మహిళలకు నిర్వహించగా, దాదాపు అందరిలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మరో పేషెంట్ కి కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండగా, శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు.మహిళల్లో మూత్ర సమస్యలు కేవలం వైద్య పరమైన సమస్యలే కాకుండా సామాజిక, భావోద్వేగ భారం కూడా అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఇబ్బందులపై మాట్లాడటాన్ని చాలామంది మహిళలు ఇబ్బందిగా భావిస్తారని, ఇదే సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతోందని అన్నారు. అవగాహన, సమయానుకూల చికిత్స ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని వారు స్పష్టం చేశారు.

About Author