పోలవరం ఆంధ్రప్రదేశ్ ఆధునిక దేవాలయం
1 min read

పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు
నాణ్యత విషయంలో రాజీలేదు
జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను, ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. ఈ మహా యజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామన్నారు.ఇరిగేషన్ రంగానికి గతంలోనూ, ఇప్పుడు పెద్ద పీట వేసి, అవి పూర్తి అయ్యేలా చేసింది, చేస్తోంది కూటమి ప్రభుత్వమే.. అని ఆయన చెప్పారు.ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా, రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పై సూచనలు, సలహాలు, విమర్శలు, డిమాండ్స్ వస్తున్నా, వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత పై గాని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈ ఎన్ సి నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, మరియు కాంట్రాక్టు ఏజెన్సీ ల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.


