పన్నులతోనే ప్రగతి….
1 min read

నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు
మార్చి 31 వరకు ప్రతి రోజూ పన్ను వసూళ్లు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రగతి సాధ్యమని నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు అన్నారు. మంగళవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూళ్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెలవు దినమైన ఆదివారం, పండుగల దినాల్లో సైతం నగర ప్రజలు తమ ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల చెల్లించవచ్చని తెలిపారు. వచ్చే నెలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, మార్చి 31 వరకు నగరపాలక కార్యాలయంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను సెలవు రోజుల్లో సైతం పన్నులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. దండిగేరి, పెద్దపడఖాప 20,21వ సచివాలయం, కేఎంసి పాత కార్యాలయం, బి.క్యాంపు, అరోరా నగర్ 56,57వ సచివాలయం, గురు రాఘవేంద్ర నగర్, రాజీవ్ గృహకల్ప 92,93వ సచివాలయం, కల్లూరు వార్డు కార్యాలయం 84,85వ సచివాలయం, లక్ష్మి నగర్, జెఎన్‌ఆర్ నగర్ 61,62వ సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పన్నులు చెల్లించవచ్చని, యూపీఐ ప్లాట్‌ఫాంల ద్వారా సైతం పన్నులు చెల్లించవచ్చని సూచించారు. ఆన్‌లైన్ సేవా కేంద్రాల ద్వారా సౌకర్యవంతంగా పన్నులు చెల్లించవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

