నగరాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం
1 min read

పశువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలితే చర్యలు
ఖాళీ స్థలాలను శుభ్రం ఉంచుకోని యజమానులపై చర్యలు
మిగిలిన ఆహారం బహిరంగ ప్రదేశాల్లో పారవేయోద్దు
ప్రతి పౌరుడు పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడి సహకారం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం నగరపాలక కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించడం, ఖాళీ స్థలాలను చెత్తతో అపరిశుభ్రంగా ఉంచిన యజమానులపై చర్యలు తీసుకోవడం, మిగిలిన ఆహారాన్ని బహిరంగ ప్రదేశాల్లో పారవేయడాన్ని అరికట్టడం, పురమిత్ర యాప్ వినియోగాన్ని ప్రతి కుటుంబానికి విస్తరించే అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత, రహదారి భద్రత, ఆరోగ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. పశువులను రహదారులపై వదిలితే గోశాలకు తరలించి, వారంలోపు జరిమానా చెల్లించి తీసుకోకపోతే యాజమాన్య హక్కులు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలను మూడు రోజుల్లో యజమానులు స్వచ్ఛంగా శుభ్రం చేసుకోకపోతే నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 119 రకాల నగరపాలక సేవలను సులభంగా అందుకునేందుకు ప్రతి కుటుంబం పురమిత్ర యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని సమస్యలను వెంటనే తెలియజేయాలని కోరారు. నగర రూపురేఖలను మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఇంచార్జ్ ఎస్.ఈ. శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

