యూరియా నిల్వల పై నోరు మెదపని షాపు యజమానులు
1 min read

మహానంది, న్యూస్ నేడు: ప్రైవేట్ షాపు యజమానులు యూరియానిలువలపై నోరు మెదపడం లేదు. గురువారం మండల తహశీల్దార్ రమాదేవి, ఏవో నాగేశ్వర్ రెడ్డి, ఎస్సై రామ్మోహన్ రెడ్డి బుక్కాపురం గ్రామంలోని 3 ప్రైవేటు రసాయనిక ఎరువులు, పురుగుమందుల విక్రయ షాపులపై దాడులు నిర్వహించారు. కృష్ణా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, బైసాని ట్రేడర్స్ , మరో విక్రయ కేంద్రం తదితర వాటిపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. షాపుల్లో ఉన్న యూరియా నిలువలపై ఆరా తీసి వీటిని రైతులకు ఎందుకు విక్రయించడం లేదని ఎందుకు నిలువలు ఉంచారని ప్రశ్నించారు. వ్యాపారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో పాటు మీరు విక్రయాలు చేపడితే గంటల వ్యవధిలోనే యూరియా నిలువలు ఖాళీ అవుతాయని ఎందుకు దాచిపెడతారని వెంటనే రైతులకు విక్రయించాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా, ఇతర రసాయనిక ఎరువులు, పురుగు, తెగుళ్ళ మందులు అధిక ధరలకు విక్రయిస్తే 6 ఏ కింద కేసు నమోదు చేసి షాపులను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రైతులకు యూరియా అందడం లేదని గగ్గోలు పెడుతుంటే ఈ నిలువల సంగతి ఏమిటని ప్రశ్నించారు. బైసాని ట్రేడర్స్ షాపు వద్ద చిరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్న స్టాకు నిలువల వివరాల బోర్డును చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రసాయనిక ఎరువులు, పురుగుమందుల విక్రయ కేంద్రం వద్ద స్టాకు బోర్డుపై వివిధ రసాయనిక ఎరువుల పేర్లు ఉన్న వాటి నిల్వలు వివరాలు లేకపోవడంతో పాటు కేవలం యూరియా నిల్వలు 45 బస్తాలు మాత్రమే ఉన్నట్టు పట్టికలో చూపించడం చర్చనీయాంశంగా మారింది. స్టాకు నిల్వలు మాత్రం ప్రత్యేక రూములో 200 బస్తాలు పైచిలుకు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రైవేట్ వ్యాపారుల మాయజాలంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేట్ వ్యాపారులను తీవ్రంగా మందలించడంతోపాటు మరోసారి ఎలాంటి పొరపాట్లు జరిగిన ఉపేక్షించబోమని రైతులకు రసాయనిక మరియు పురుగుమందుల విక్రయాలు నిర్ణయించిన ధరకే విక్రయించాలని, యూరియా కొనుగోలు సమయంలో రైతులకు గుళికలు, పురుగు మందులు అంటగడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. విధిగా ఈ పాస్ యంత్రాలను ఉపయోగించాలని రైతులకు సరైన బిల్లులను కొనుగోలు సమయంలోఅందజేయాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే యూరియాను ప్రైవేటు వ్యాపారులు క్రయవిక్రయాలు మానుకోవాలని అధికారులు సూచించారు.

