NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమ్మె జీతభత్యాల కోసం కాదు.. పని భారం తగ్గించుకోవడం కోసం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన బ్యాంకుల ఒక్కరోజు సమ్మెను పురస్కరించుకొని, కర్నూలు సిటీ స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర ప్రభుత్వ రంగ బ్యాంకుల, ప్రైవేట్ బ్యాంకుల, గ్రామీణ బ్యాంకుల మరియు కోఆపరేటివ్ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.గత పదేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రధానంగా కోరుతున్న డిమాండ్ వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానం (5 Days Banking) అమలు చేయాలనేదే. ఈ డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) 2023 డిసెంబర్ 7న బ్యాంకు యూనియన్లతో కుదిరిన అవగాహన ఒప్పందంలో అంగీకరించింది. అనంతరం 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని అంగీకరించి, కేంద్ర ప్రభుత్వ అనుమతికై పంపడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ అనుమతికై IBA ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదు. గతంలో సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగిన కన్సిలియేషన్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు “ఖచ్చితంగా ఐదు రోజుల పని విధానం అమలు చేస్తాము” అని హామీ ఇవ్వడంతో యూనియన్లు సమ్మెను విరమించుకున్నాయి. కానీ ప్రస్తుతం “ఖాతాదారులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది” అని చెప్పడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా బ్యాంకు ఉద్యోగులు అనారోగ్యానికి గురై, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ పని ఒత్తిడి తగ్గాలంటే వారానికి కనీసం రెండు రోజులు విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులతో గడిపే సమయం లభిస్తే ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషిన్లు ఉన్నప్పటికీ బ్యాంకుల్లో పని భారం తగ్గకపోగా మరింత పెరుగుతోంది. బ్యాంకింగ్ పనులతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ వంటి మూడవ పార్టీ ఉత్పత్తుల అమ్మకాల కోసం ఉద్యోగులు, అధికారులపై టార్గెట్లు విధించి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉద్యోగుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా మారింది.ఈ నేపథ్యంలో వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం న్యాయమైన డిమాండ్ అని, బ్యాంకు ఉద్యోగులు ఆరోగ్యంగా 60 సంవత్సరాల వయస్సులో ఉద్యోగ విరమణ చేయాలంటే ఇది తప్పనిసరి అని నాయకులు స్పష్టం చేశారు.ఈ సమ్మె కారణంగా బ్యాంకు ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి బ్యాంకు ఉద్యోగులు చింత వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మె జీతభత్యాల కోసం కాదు, పని భారం తగ్గించుకోవడం మరియు ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని ప్రజలు గుర్తించాలని, ఈ న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ సమ్మె UFBU కన్వీనర్ ఇ. నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలోAIBEA నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, ఎల్లయ్య, వాసుదేవ రెడ్డి, AIBOC నాయకులు జియా ఉర్ రహమాన్ (SBI), రాజు (UBI), పుష్పక్ కుమార్ (Canara Bank),NCBE నాయకులు విద్యా సాగర్ (DGS, SBI),APGB నాయకులు హనుమంత రెడ్డి, వాసు CITU నాయకులు అంజి బాబు, AITUC నాయకులు మునెప్ప LIC, GIC నాయకులు సునీయ కుమార్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author