NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నియామ‌కం రాజ్యాంగ వ్యతిరేకం.. ప్రభుత్వం పున‌రాలోచించాలి

1 min read

రాష్ట్ర పశు సంవర్ధక  శాఖ డైరెక్టర్ పున‌ర్నియామ‌కంపై ఏపి యానిమ‌ల్ హ‌జ్‌బెండ‌రీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ విజ్ఞప్తి

విజ‌య‌వాడ‌, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక  శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికి ఇటీవ‌ల డైరెక్టర్ పదవి నుండి రిటైర్ అయిన డాక్టర్ టి.దామోదర నాయుడుకు తిరిగి అదే పదవీ బాధ్యతలు అప్పచెప్పాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమ‌ని ఏపి యానిమ‌ల్ హ‌జ్‌బెండ‌రీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్ష‌, ప్రధాన కార్యద‌ర్శులు డాక్టర్ సీహెచ్ కృష్ణారావు, డాక్టర్ ఎస్‌.ఎల్‌. గణేశ్వరరావు అన్నారు. సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కృష్ణారావు, గణేశ్వరరావులు మాట్లాడుతూ, డైరెక్టర్ పదవి రిటైర్ అయిన ఏ వ్యక్తికి అయినా ఇవ్వడం సమానత్వం మరియు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైన ప్రక్రియ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ పదవికి ఈ ఏడాది జులై 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన దామోదర నాయుడుని తిరిగి డైరెక్టర్ పదవికి కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. పశు సంవర్థక శాఖలో డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికి సీనియారిటీ, నియమాలు, ప్రమోషన్ రూల్స్ మరియు స్పష్టమైన నియామక ప్రక్రియ ఉన్నప్పటికీ వాటిన్నిటిని పాటించకుండా, డిపార్ట్‌మెంట్‌లోని అన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకస్తున్ప్పటికీ రిటైర్ అయిన అధికారిని తిరిగి అదే పదవిని అప్పచెప్పాలనే ప్రయత్నం చేయడాన్ని ప‌శు సంవర్ధక శాఖ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ‌ని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ నుండి డైరెక్టర్ వరకు ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్న ప్రమోషనల్ ఛానల్ దెబ్బతిని అందరు నష్టపోయే పరిస్థితి వస్తుందని మరియు సీనియారిటి హక్కులను కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేద‌న వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సీనియారిటీ ప్రకారం, ప్రమోషన్  ద్వారా డైరెక్టర్ పదవికి అర్హులు వరుసలో ఉన్నార‌ని, వారిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ముందు వరుసలో ఉన్నార‌ని పేర్కొన్నారు. రిటైర్ అయిన డైరెక్టర్ పోస్టుకు షెడ్యూల్ కాస్ట్ అధికారి ముందు వరుసలో ఉన్నార‌ని, మ‌రియు ఇద్దరు రాష్ట్ర స్థాయి క్యాడర్‌లో ఉన్న మహిళా అధికారులకు నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంద‌న్నారు. వీరందరికి అర్హత ఉన్నా కూడా ఆ పదవి దక్కనివ్వకుండా వివక్షత చూపుతున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై పున‌రాలోచించి డైరెక్టర్ ప‌ద‌వికి అర్హులైన వారిని నియ‌మించాల‌ని విజ్ఞప్తి చేశారు. విలేక‌రుల స‌మావేశంలో అసోసియేష‌న్ కోశాధికారి డాక్టర్ ఎన్.సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.రవిబాబు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇ.రాజేష్, ఈసీ సభ్యులు డాక్టర్ ఎల్.రమేష్, డా. జె.కృష్ణకుమార్, ఉద్యోగ సంఘ సభ్యులు డా. సురేష్, డా.దినకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author