కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ10 వేలన్నారు..!
1 min read

అధికారం లోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు
వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి
చెన్నూరు , న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి తీరా అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కూటమిప్రభుత్వానికి దక్కిందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి ఎద్దేవ చేశారు. మంగళవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి వాలంటీర్ కి నెలకు 5 వేల రూపాయల గౌరవ వేత్తనం ఇస్తూ, ప్రభుత్వ పథకాలలో వారిని భాగస్వామ్యం చేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లను పనిచేసే విధంగా ఆ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారకముందే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఇంటింటికి వెళ్లి డోర్ తట్టి మరి లేపి వారికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగేదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను మరింత ప్రతిష్టపరిచి ప్రభుత్వ పథకాలకు వారధిగా ఉండేలా చూసుకుంటామని ఎన్నికల హామీలలో ఒకటిగా పొందుపరచి ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కడం జరిగిందన్నారు. అలాగే వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి వారి పెన్షన్ ఇవ్వకుండా, సచివాలయ ఉద్యోగులు ఎక్కడో ఒకచోట నిలబడి అక్కడికి వృద్ధులను, వికలాంగులను పిలిపించుకొని వారికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో వికలాంగులు వృద్ధులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన యువతి, యువకులు అప్పుడు ప్రభుత్వం అందజేసిన 5 వేల రూపాయలు తమ కుటుంబ ఖర్చులకు వచ్చేదని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి తమకు పదివేల రూపాయలు వస్తాయని ఆశ పెట్టుకుంటే ఆ ఆశ, నిరాశ గా మిగిలిందని నేడు వాలంటీర్లు మనోవేదన చెందుతున్నారని, కూటమి ప్రభుత్వ మోసం చేసిందని బహిర్గతంగా చెప్పుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందని గగ్గోలు పెట్టిన ప్రభుత్వం, నేడు బహిరంగంగానే తెలుగు తమ్ముళ్లు కల్తీ మద్యం గురించి మాట్లాడకపోవడం దారుణమని తెలిపారు. ఆశలకు హద్దు ఉండదు, చెప్పే దానికి సిగ్గు ఉండదు, అనే చందంగా అధికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకుని ప్రజలకు అలివి కాని హామీలు గుప్పించి నేడు అధికారంలోకి రాగానే, హామీలన్నీ తుంగలోకి తొక్కిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ముఖ్యంగా, వృద్ధులను వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా వారికి ఇచ్చే పెన్షన్ వారింటికి వెళ్లి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

