అవగాహనతోనే… క్యాన్సర్ నియంత్రణ
1 min read
అప్రమత్తంగా ఉంటే ఒక్క ఇంజెక్షన్‌తో క్యాన్సర్ నయం..
బచ్చు జానకిరాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. బి.రవీంద్ర బాబు, బి.సాయివాణికి అభినందన
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు: క్యాన్సర్ నియంత్రణకు అవగాహనే ప్రధాన ఆయుధమని, ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్చు జానకిరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పారిశుద్ధ్య కార్మికులకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, ముందస్తు పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 9 నుండి 14 ఏళ్ల కార్మికుల పిల్లలకు క్యాన్సర్ నిరోధక టీకాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. క్యాన్సర్‌పై భయం కాకుండా జాగ్రత్త అవసరమని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద వైద్య సంస్థలు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సామాజిక బాధ్యత.. :డాక్టర్ బి.రవీంద్ర బాబుబచ్చు జానకిరాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.రవీంద్ర బాబు, బి.సాయివాణి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సులో తమవంతు సామాజిక బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఒక్కొక్కటి రూ.2,500 విలువైన హెచ్‌పీవీ క్యాన్సర్ నిరోధక టీకాలను ఇప్పుడు ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.


