కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులు హేతుబద్దీకరణ
1 min read
జిరాయితీ, డి.ఫారం భూమి,సుప్రీం కోర్ట్ నియమించిన కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజులలోగా సమర్పించాలి
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులు హేతుబద్దీకరణ,జిరాయితీ, డి.ఫారం భూమి,తదితర అంశాలపై సుప్రీం కోర్ట్ నియమించిన కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజులలోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం హరిహద్దుల హేతుబద్దీకరణ, జిరాయితీ,డి.ఫారం భూమి వివరాలు, సదరు భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి,అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ప్రిన్సిపల్ చీఫ్ అఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ డా.పి .వి. చలపతిరావు, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ జ్యోతి లతో కలిసి అటవీపర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతీలాల్ దండే స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు,జిరాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యలు పరిష్కారం, జిరాయితీ, డి-పట్టాదారుల పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీం కోర్ట్ సాధికార కమిటి కి సమర్పించడం జరిగిందని, ఈ విషయంపై సుప్రీం కోర్ట్ సాధికార కమిటి పరిశీలించి మరికొంత అదనపు సమాచారాన్ని కోరిందన్నారు. సమాచారం కోరిందన్నారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాలలో కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ పరిధిలో ఉన్న జిరాయితీ మరియు డి-ఫారం పట్టా భూముల విస్తీర్ణం మరియు స్థితి, మరియు అటువంటి భూముల ప్రస్తుత విస్తీర్ణం మరియు స్థితితో పాటు, కలెక్టర్ల ఉత్తర్వుల ప్రకారం డి-ఫారం పట్టాల రద్దుకు సంబంధించిన వివరాలను సమర్పించాలన్నారు. నోటిఫై చేయబడిన కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాంతం మరియు దాని సరిహద్దును గుర్తించి, నిర్ధారించడం, గ్రామాల వారీగా సర్వే నంబర్ల వివరాలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, కాలిబాటలు, విద్యుత్ లైన్లు మరియు ఇతర ప్రస్తుత మౌలిక సదుపాయాల వివరాలతో మ్యాప్ లను సమర్పించాలన్నారు. నీటిపారుదల, పంచాయతీ రాజ్, రైల్వే,విద్యుత్ మరియు అటవీ శాఖలకు సంబందించిన వివరాలు,పునరావాస ప్రాంతాల కోసం ప్రతిపాదించబడిన ప్రాంతాల ప్రస్తుత క్షేత్రస్థాయి స్థితిని, అక్కడ ఇప్పటికే ఉన్న పక్షులు, ఆవాస వివరాలు ప్రతిపాదిత అభయారణ్య హేతుబద్ధీకరణ మరియు పునరావాసం యొక్క పర్యావరణ ప్రభావాలను, పరిరక్షణ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ అధ్యయనాలు మరియు నిపుణుల అంచనాలను సమర్పించాలని, సదరు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర సాధికార కమిటీ కి సమర్పించడం జరుగుతుందన్నారు.సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు డా. ఎం.జె. అభిషేక్ గౌడ,కె. ఆర్. కల్పశ్రీ, డిఎఫ్ఓ లు సందీప్ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి, ఆర్డీఓ లక్ష్మిప్రసన్న, డిపిఓ మల్లికార్జునరావు, ట్రాన్స్కో ఎస్ఈ కె. ఎం. అంబేద్కర్ , కొల్లేరు ప్రాంత మండల తహసీల్దార్లు, రెవిన్యూ, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.



